ఓడినా....గెలిచిన
మీరంతా ఊహించినట్టే సాంప్రదాయ రాజకీయ పార్టీలను ఎదురొడ్డి నిలవలేకపోయా. 907 వోట్లు మాత్రమే తెచ్చుకోగలిగా. నాలుగవ స్థానంలో నిలిచా. 42 శాతానికి మించి ప్రజలని పోలింగ్ బూత్ లకు రప్పించలేకపోయా. చదువుకున్న విద్యార్దులను మందు బాటిల్ల నుంచి దూరం చెయ్యలేకపోయా. హాస్టళ్ళలో వోటుకి 1000-1500 రూపాయలు తీసుకోకుండా ప్రజలను చైతన్యపరచలేకపోయా. మహిళా సంఘాల ఓట్లను కొనకుండా ఆపలేకపోయా. సొంత ఇళ్ళు ఉన్నవాల్లను కూడా పార్టీలు పంచిన మందు బాటిళ్ళు స్వీకరించకుండా ఆపలేకపోయా. నా ఉపన్యాసాలు విన్న వారిని కూడా నేనే ఉత్తమమైన అభ్యర్దినని నమ్మించలేకపోయా. మరి ఈ పోరాటం ఎందుకోసం అంటారా?
1) ఒక మాజీ కార్పొరేటర్ "2 నిముషాలు ఆ అబ్బాయి మాటలు వింటే, నాకే అతనికి వోటెయ్యాలనిపించింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?" అని అన్నప్పుడు- అన్ని పార్టీల్లో మంచి వారు ఉన్నరు. ప్రజల్లో ఇంకా మంచితనం ఉంది. దాన్ని బయటికి తియ్యడానికి పోరాడాలనిపించింది.
2) ఇంటి దగ్గర ఒక ఆంటీ మాట్లాడుతూ "మా ఆయన ఫలానా పార్టీకి పని చేస్తున్నాడు. నిన్న మా ఆయనతో గొడవ పడ్డ. నీకు పోలింగ్ ఏజెంట్గా పని చేస్తానంటే, మా ఆయన "ఇదొక్క సారి నా మాట విను. ఇంట్లో భార్యను ఒప్పించలేక పోతే నువ్వు జనాలని ఎలా ఒప్పిస్తావ్? అని మా నాయకులు ప్రశ్నిస్తారు" అని అన్నాడు. నేను వోటు మాత్రం నా ఇష్టం ఉన్న వాళ్ళకు వేస్తానని చెప్పిన. నా వోటు నీకే. లేకపోతే ఈ మందు బోటిల్లు పంచడం ఏంటి. ఇంకా ఎన్నిరోజులని జనాలని మోసం చేస్తారు " అని అన్నప్పుడు మంచి భావజాలానికి సాంప్రదాయ రాజకీయ పార్టీల కుటుంబాలనుంచి కూడా మద్దతు వస్తుందని నమ్మకం వచ్చింది. వీళ్ళు కోరుకుంటున్న మార్పు తీసుకురావడానికి పోరాడాలనిపించింది.
3) వోటింగ్ రోజు ఒక యువ జంట పోలింగ్ బూత్ ముందు నిలబడి " మీకు వోటేద్దామని కుకట్పల్లి నుంచి వచ్చాం(30 km). మీ స్పీచ్ ఫేస్ బుక్ లో చూసాం" అని అన్నప్పుడు పేస్ బుక్కుల్లో ఉన్నవారు కేవలం మాటలకే పరిమితం కాదని అర్ధమయ్యింది. చదువుకున్న వారి ద్వారా మార్పు తీసుకురావొచ్చని, దానికోసం పోరాడాలనిపించింది.
4) వోటింగ్ రోజు సాయకాలం రోడ్డుమీద నడుస్తుంటే ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి, వారిలో ఒకరు "అన్నా ఏమనుకోకండి అన్నా. మా మనసులు చంపుకోలేక ఒక వోటు మీకు, ఇంకో వోటు TDP కి వేసాం అన్నా" అని అన్నప్పుడు కొద్దిగా కష్టపడితే, ప్రజలను సాంప్రదాయ రాజకీయ పార్టీలనుంచి దూరం చెయ్యొచ్చు అనిపించింది. అలా చెయ్యడానికి పోరాడాలనిపించింది.
5) ఎక్కడ్నో హుజూరాబాద్ లో పేస్ బుక్ లో నా స్పీచ్ విని, వెంటనే మూట సర్దుకొని హైదరాబాద్ బసెక్కిన పూర్ణ చందర్ ని చూసి, పోరాటంలో నేను వొంటరిని కాదన్న రెట్టించిన ఉత్సాహంతో పోరాడాలనిపించింది.
6) చిన్న పిల్లలకు కూడా నేనే గెలవాలనిపించేటట్టు మన భావజాలం ఉందని అర్దమైనప్పుడు, ఏదో ఒక రోజు మార్పు తప్పనిసరిగా వస్తుందని అర్ధమయ్యి పోరాడాలనిపించింది.
7) వోటింగ్ రోజు నేను పోలింగ్ బూత్ లు సందర్శిస్తుంటే, ప్రతి పార్టీ నాయకుడు నన్ను ఆపి మరీ "నీలాంటి వారు రాజకీయ్యాల్లోకి రావాలి. అందరిలో ఉత్తమ అభ్యర్ధి నువ్వే. నిన్ను సపోర్ట్ చెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాము. ఆల్ ది బెస్ట్. నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది " అని అన్నప్పుడు, మార్పు అతి త్వరలో సాకారం కాబోతోందన్న విషయం అర్ధమయ్యి పోరాడాలనిపించింది.
8) ఎన్నికల తర్వాత ఒక restaurant కి వెళితే అక్కడ వెయిటర్ "మిమ్మల్ని P&T కాలనీలో చూశ్న. ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకుంటున్న. మీరు మీ పోరాటాన్ని ఆపొద్దు. ఎంతో మంది మౌనంగా మీ విజయాన్ని కోరుకుంటున్నారు. మీకు హాట్స్ ఆఫ్. ఇవ్వాల మద్యానం మంత్రి ******* వచ్చారు. కాని మేము పట్టించుకోలే. మిమ్మల్ని మాత్రం పట్టించుకోకుండా ఉండలేం. మీరు చేస్తున్న వర్క్ అలాంటిది. మా సపోర్ట్ ఎప్పటికైనా మంచి వైపే. ఆల్ ది బెస్ట్ " అన్నప్పుడు, కనీసం ఇలాంటి వారికోసమైనా పోరాడాలనిపించింది.
9) నన్నెప్పుడు చూడని ఎంతో మంది online లో నన్ను గెలిపించమని పోస్టులు పెడుతుంటే, నన్ను చూడని వారు నాకు చందాలు ఇస్తుంటే, మంచికి కాలం చెల్లలేదు, మంచి రాజకీయాన్ని గెలిపించుకోవడం అంత కష్టమేం కాదు అని తెలిసి పోరాడాలనిపించింది.
10) నా ప్రచారానికి నాకంటే ఎక్కువ కష్టపడ్డ మా కార్యకర్తల, స్నేహితుల తపన చూసి, నేను ఓడిపోయినప్పుడు ఏడ్చిన వారిని చూసి, నేను ఓడిపోయానని తెలిసి నిద్రలేని రాత్రి గడిపిన కొంత మందిని చూసి- వీళ్ళ విశ్వాసాన్ని గెలిపించడానికైనా పోరాడాలనిపించింది.
అందుకే ఎన్నికల్లో ఓడినా- ప్రజల మనసులు గెలిచానని అనిపించింది.
నన్ను ప్రోత్సహించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
Comments
Post a Comment